అసలు "స్థితప్రజ్ఞత" అంటే
ఏంటో తెలిసే పుస్తకానికి ఆ పేరు పెట్టారా?
తాడేపల్లి
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకావిష్కరణ
పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ జర్నలిస్ట్, టెక్నోక్రాట్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ రచించిన ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకాన్ని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ రాజకీయ జీవనయానం, ఆయన రాజకీయ ప్రస్థానంలోని వివిధ ఘట్టాలు, నాయకత్వ లక్షణాలను సమగ్రంగా సంకలనం చేస్తూ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ ఈ పుస్తకాన్ని రచించారు.
ఈ సందర్భంగా శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, శ్రీ వైయస్ జగన్ రాజకీయ ప్రస్థానాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి ‘స్థితప్రజ్ఞుడు’ పేరుతో పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. ఒక రాజకీయ నాయకుడి ప్రయాణాన్ని, ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను, తీసుకున్న నిర్ణయాలను, ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధాన్ని పుస్తక రూపంలో భద్రపరచడం భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
“శ్రీ వైయస్ జగన్ గారి రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లు ఎదురైనా స్థిరచిత్తంతో ముందుకు సాగిన తీరు ఈ పుస్తకం శీర్షికలోనే ప్రతిబింబిస్తోంది” అని సజ్జల అన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానంలోని ముఖ్య ఘట్టాలను ఒకేచోట చేర్చి పాఠకులకు అందించడం రచయిత చేసిన మంచి ప్రయత్నమని అభినందించారు.
“రాజకీయ చరిత్రను కేవలం సంఘటనలుగా కాకుండా, వాటి వెనుక ఉన్న పరిస్థితులు, నాయకత్వ ధోరణి, ప్రజలతో ఉన్న సంబంధాన్ని కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ‘స్థితప్రజ్ఞుడు’ ఒక మంచి ప్రయత్నం” అని పేర్కొన్నారు.
పుస్తక రచయిత డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మను అభినందించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ పుస్తకం పాఠకుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రచయిత డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత, ఎంవీఎస్ నాగిరెడ్డి, కొవ్వూరి త్రినాథరెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.